ఏపీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అక్టోబర్ 27 నుంచి ప్రారంభం
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ముఖ్య సమాచారం! రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 27 నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.
రైస్ మిల్లర్ల సమావేశంలో మంత్రి వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైస్ మిల్లర్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం వదిలిన రూ.1674 కోట్ల బకాయిలను చెల్లించినట్లు, అలాగే రైస్ మిల్లర్లకు చెల్లించాల్సిన రూ.763 కోట్లను కూడా సకాలంలో చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అందరినీ కలుపుకుని పనిచేస్తున్నామని ఆయన అన్నారు.

Andhra Pradesh ధాన్యం కొనుగోలు లక్ష్యం
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గత ఏడాది 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. రైతుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్మకాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. రైతులు వాట్సాప్‌లో ‘హాయ్’ అని మెసేజ్ పంపగానే కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని, 24 నుంచి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అక్రమ రవాణాపై నిఘా
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. అలాగే, గత అనుభవాల ఆధారంగా తేమ శాతం కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగులు, రవాణా సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని రైస్ మిల్లర్లకు సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు
అక్టోబర్ 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సీజన్‌లో 3013 రైతు సేవా కేంద్రాలు, 2061 పీపీసీ ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు మొత్తం 10,700 మంది సిబ్బందితో ధాన్యం సేకరణ ప్రక్రియను చేపడతామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధాన్యం సేకరణ వివరాలను వివరించారు
Bigg Boss 9 Telugu Day 39 మాధురి నోటికి రీతూ కళ్లెం…
